బెంగళూరు, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ మాట్లాడారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ ‘టిప్పు సుల్తాన్ను హతమార్చినట్టు సిద్ధరామయ్యనూ హతమార్చాలి. నాడు టిప్పుసుల్తాన్ను హురిగౌడ, నంజేగౌడ ఏవిధంగానైతే పైకి పంపారో.. అదే విధంగా చేయాలి’ అని అన్నారు.
సిద్ధరామయ్య స్పందిస్తూ ‘మహాత్మాగాంధీని హత్య చేసిన వ్యక్తిని ఆరాధించే పార్టీ నేతలకు ఇలాంటి మాటలే వస్తాయి’ అని పేర్కొన్నారు. ఇలాంటి నేతలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని, గవర్నర్ జోక్యం చేసుకొని అశ్వత్థను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు. అశ్వత్థను అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఆందోళనలు చేప ట్టింది. కాగా, తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సిద్ధరామయ్యను రాజకీయంగా అంతం చేయాలనే అర్థంలోనే అలా మాట్లాడానని మంత్రి అశ్వత్థ నారాయణ సమర్థించుకున్నారు.