Karnataka : నిషేధిత చైనా మాంజా ప్రజల ప్రాణాలు బలిగొంటూనే ఉంది. తెలంగాణసహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పలువురు మరణించగా.. తాజాగా కర్ణాటకలో మరొకరు మృతి చెందారు. చైనా మాంజా కారణంగా, కర్ణాటక బీదర్ జిల్లాలోని తలమదగి బ్రిడ్జి వద్ద, రోడ్డుపై సంజు కుమార్ హోసమణి (48) అనే వ్యక్తి మరణించాడు. అతడు బైకుపై వెళ్తుండగా, గొంతుకు చైనా మాంజా తగిలింది. ఆ మాంజా దారం గొంతు లోపలి వరకు తెగడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.
స్థానికులు గమనించి, గొంతుపై క్లాత్ కప్పి అతడి రక్తస్రావం ఆపేందుకు ప్రయత్నించారు. అంబులెన్సుకు ఫోన్ చేశారు. అయితే, అంబులెన్స్ వచ్చే లోపే అతడు మరణించాడు. రక్తస్రావమై బాధపడుతున్న సంజుకుమార్ తన కూతురుకు చివరిగా కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సంజు కుమార్ బంధువులతోపాటు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే అతడు మరణించాడని వారు మండిపడుతున్నారు. అలాగే చైనా మాంజా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై మన్నా ఎఖల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చైనా మాంజాపై ప్రభుత్వాలు నిషేధం విధించినా.. మార్కెట్లో అక్రమంగా అమ్మకాలు సాగుతున్నాయి. ఈ మాంజా కారణంగా మధ్య ప్రదేశ్ లో రఘువీర్ అనే వ్యక్తి సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా ఢిల్లీ, తెలంగాణలోనూ ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.