Karachi Port : ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా తాము ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant) యుద్ధ నౌక (War Ship) సహా 36 షిప్‌లతో పాకిస్థాన్ (Pakistan) లోని కరాచీ పోర్టు (Karachi Port) ను దిగ్బంధించామని భారత నేవీ అధికారులు (Indian Navy officers) తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇటీవల భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్థాన్ సైన్యం భారత్‌పై దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ ప్రతిస్పందిస్తుందని ముందే పసిగట్టిన నావికాదళం నాడు సముద్ర సంసిద్ధతను గణనీయంగా పెంచింది. కరాచీ పోర్టు లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకతోపాటు మొత్తం 36 షిప్‌లను, జలాంతర్గాములను మోహరించింది. ఈ విషయాన్ని తాజాగా నేవీ అధికారులు వెల్లడించారు. నౌకల మోహిరింపుతోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్థాన్‌పై తాము త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు తెలిపారు. కరాచీ పోర్ట్ లక్ష్యంగా 36 ఫ్రంట్‌లైన్ నావికాదళాలను మోహరించామన్నారు. వాటిలో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఏడు డిస్ట్రాయర్లు, మీడియం-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు (MRSAM), వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడో ఉన్నాయని చెప్పారు. వీటిలో కొత్తగా ప్రవేశపెట్టిన INS తుషిల్‌తో సహా ఏడు స్టెల్త్ గైడెడ్-క్షిపణి యుద్ధనౌకలు సైతం ఉన్నట్లు తెలిపారు.
ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టును దిగ్బంధించడం వల్ల పాకిస్థాన్ నావికాదళం సమర్థవంతంగా ప్రతిస్పందించలేకపోయిందని అధికారులు చెప్పారు. కేవలం నౌకాశ్రయానికే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల వేళ అంతర్జాతీయ వాణిజ్య నౌకలు తమ దారిని మళ్లించుకున్నాయని తెలిపారు. కాగా భారత సన్నద్ధతను చూసి పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. పాకిస్థాన్ డీజీఎంవో హాట్లైన్లో భారత డీజీఎంవోతో మాట్లాడి కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. అందుకు భారత్ అంగీకరించింది.