నీలగిరి, జూలై 25: గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 5.6 కిలోల గంజాయి, 500 మిల్లీ లీటర్ల వీడ్(హాష్)ఆయిల్, 5 బైకులు, 4 సెల్ ఫోన్లు, డమ్మీ తుపాకీ, బటన్ చాకులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి వెల్లడించారు. శనివారం నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 24న మునుగోడు బైపాస్ రోడ్డులోని ఖాళీ జాగాలో కొంతమంది యువకులు గుమిగూడి గంజాయి విక్రయిస్తూ, వినియోగిస్తున్నారనే నమ్మదగిన సమాచారం అందడంతో వన్‌టౌన్ పోలీసులు అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. పోలీసులను చూసి వారు పారిపోయేందుకు ప్రయత్నించగా ఎనిమిది మందిని పట్టుకున్నట్లు తెలిపారు. అందులో మైనర్ బాలుడు కూడా ఉన్నారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన కస్పరాజు నాగరాజు @ కస్పా, ఖాజీ రామారం గ్రామానికి చెందిన గంటెకంపు మధు @ కిరణ్ నల్లగొండ శ్రీనగర్ కాలనీకి చెందిన చెన్నపాక సుశాంక్ @ డెడ్లీ, పెండ్ర వాసు @ చింటు, సయ్యద్ షోయబ్ @ షోబి, సూర్యాపేటకు చెందిన గంధం శివమణి, చెరుకు దీపక్ @ పల్లి, నకిరేకంటి ధరణి కుమార్ @ బబ్లూ, ఓ మైనర్ బాలుడిగా తేలిందన్నారు.
మత్తుకు బానిసలై గతంలో 15 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన నిందితులు పెండ్ర వాసు, హరి ఒక ముఠాగా ఏర్పడి డబ్బు సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో జూన్ 29న హైదరాబాద్‌లో చోరీ చేసిన రెండు బైకులపై గంజాయి తెచ్చేందుకు ఒడిశాలోని పసుపులంక గ్రామానికి బయల్దేరారు. ఆ సమయంలో ఖమ్మం జిల్లా ఎక్నూర్ వద్ద ఒక యాక్టివాను చోరీ చేసి గంజాయి వ్యాపారం చేసే మనుకర్ వద్దకు వెళ్లి రెండు బైక్‌లు ఇచ్చి 12 కేజీల గంజాయి 500 ఎంఎల్ వీడ్ అయిల్ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. తిరిగి వచ్చిన తర్వాత గంజాయి, హాష్ ఆయిల్‌ను ముఠా సభ్యులు తాము పంచుకొని, మిగిలిన భాగాన్ని స్వయంగా వినియోగించారు.
మిగిలిన గంజాయిని ఈ నెల 24న నల్గొండకు తెచ్చి తమకు పరిచయం ఉన్న చెన్నపాక సుశాంక్, సయ్యద్ షోయబ్, గంధం శివమణి, చెరుకు దీపక్, నకిరేకంటి ధరణి కుమార్, ఉదయ్, జున్ను, ఓ మైనర్ బాలుడితో సాయంతో చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్న క్రమంలో పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. కాగా హరి, జున్ను, ఉదయ్ అనే వ్యక్తులు పారిపోగా మిగిలిన వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా నిందితుల వద్ద డమ్మి తుపాకీతోపాటు, ఒక బటన్ చాక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖమ్మం, నకిరేకల్‌లో చోరీ చేసిన బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు ముత్తయ్య, సంపత్, సిబ్బంది శ్రీనివాస్, శేఖర్, రబ్బాని, శంకర్, ఆంజనేయులు, అంజద్ ,కిరణ్ అంజయ్య, మహేష్ తదితరులు ఉన్నారు.