నల్లగొండ, జులై 25 : పంచాయతీ శాఖలో మళ్లీ డిప్యూటేషన్ల పైరవీలు ప్రారంభమయ్యాయి. గత డీపీవో ఉన్నప్పుడు అందినకాడికి పుచ్చుకోని 350 మందికి డిప్యుటేషన్లు ఇవ్వటంతో ఆ శాఖలోని అధికారులు విమర్శలపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మే 22వ తేదీ తర్వాత నాలుగేండ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకున్న అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేకు సుమారు 350 మందికి బదిలీ చేశారు. దీంతో వారు జూన్ 1న ఆయా ప్రాంతాల్లో జాయినయ్యారు. ఇటీవల వచ్చిన కలెక్టర్ సైతం డిప్యుటేషన్లు ఇవ్వవద్దని ఆదేశించినట్లు సమాచారం. అయితే దీన్ని పట్టించుకోని అధికారులు 63 మందికి డిప్యుటేషన్లు ఇచ్చి అందినకాడికి దండుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల వత్తిడితో పాటు అడిగిన మేరకు ఆర్థిక సహకారం అందజేసిన వారికి డిప్యుటేషన్లు ఇచ్చారట. ప్రధానంగా తమ స్వస్థలాలు..లేదా పరిసర గ్రామాల్లో కార్యదర్శులు డిప్యుటేషన్ తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా వీరికి ఆ శాఖలో ఆస్థాన కవులుగా పేరున్న ముగ్గురు కార్యదర్శులు పూర్తి స్థాయిలో అండదండలు అందించడంతో ఇతర కార్యదర్శులకు తెలియకుండా రహస్యంగా మేనేజ్ చేసినట్లు సమాచారం.
ఈ ఏడాది మేలో మొత్తం 350 మందికి అధికారికంగా బదిలీ చేయగా వారిలో 63 మంది వద్ద అంతోఇంతో తీసుకోని డిప్యుటేషన్లు ఇచ్చారు. వారిలో ఇప్పటి వరకు 60 మంది కార్యదర్శుల ప్రక్రియ పూర్తి కాగా మరో ముగ్గురి డిప్యుటేషన్ పెండింగ్‌లో పడిందంట. వారిలో మచ్చుకు కొన్ని…నేరేడుగోమ్ము నుంచి మల్లేపల్లికి, మాడ్గులపల్లి నుంచి కనగల్‌కు, గుడిపల్లి నుంచి గుర్రంపోడుకు, తిప్పర్తి నుంచి చండూరుకు, చిట్యాల నుంచి పీఏ పల్లి మండలాలకు డిప్యుటేషన్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే డిప్యుటేషన్ తీసుకున్న కార్యదర్శులు వారికి అనుగుణంగా లేకుంటే స్వగ్రామాలకు దగ్గరగా ఉన్న గ్రామాలకు వెళ్లినట్లు సమాచారం. గతంలో 350 మందికి డిప్యుటేషన్లు ఇచ్చి అభాసుపాలైన ఆ శాఖలో అధికారిక బదిలీలు చేపట్టిన అనంతరం కూడా ఆ పరిస్థితి మారకపోవటం విశేషం. గత డీపీవో హయాంలో కట్టంగూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కార్యదర్శిని బలవంతంగా మరో గ్రామానికి పంపి, అక్కడ మరో కార్యదర్శికి డిప్యుటేషన్ ఇవ్వటంతో ఆమె కన్నీరుమున్నీరైంది. అయినా పట్టించుకోని అధికారులు ఇష్టం లేకపోయినా బలవంతంగా వేరే గ్రామాలకు పంపి, వారికి నచ్చిన వారికి డిప్యుటేషన్ ఇవ్వటం గమనార్హం.
ఎమ్మెల్యే వత్తిడి, ఆర్థిక సహకారంతోనే..
పంచాయతీ శాఖలో 60 మందికి డిప్యుటేషన్లు ఇచ్చిన పంచాయతీ శాఖ అధికారులు ఈ ప్రక్రియను చాలా రహస్యంగా చేపట్టారు. షోకాజ్ నోటీసులు, మెమోలు ఇస్తే బహిరంగ పరిచే అధికారులు డిప్యుటేషన్లను ఎందుకు రహస్యంగా ఉంచారనే విషయమై పలు విమర్శలు వస్తున్నాయి. డీపీవో ఆఫీస్ నుంచి ఎంపీడీవో లాగిన్‌కు పంపి అక్కడ ఒక్క కంప్యూటర్ ఆపరేటర్, సంబంధిత ఎంపీవోకు మాత్రమే తెలిసేలా ఈ ప్రక్రియ జరిగిందట. అయితే ఎవరైతే డిప్యుటేషన్ తీసుకున్నారో ఆ ప్రక్రియను డీపీవో ఆఫీసు నుంచి చేపట్టిన సెక్షన్ అధికారి, మండల ఆఫీసుల్లోని కంప్యూటర్ ఆపరేటర్లకు అంతో ఇంతో ఇచ్చి బయటకు పొక్కకుండా చూశారట. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేల వత్తిడితో పాటు అడిగిన వారి మేరకు ఈ డిప్యుటేషన్లు ఇచ్చారట. దీనికి ఆ శాఖలోని ఆస్థాన కవులుగా ఉన్న నల్లగొండ, మునుగోడు, నార్కట్ పల్లి మండలాల్లో విధులు నిర్వహస్తున్న ఆ ముగ్గురు కార్యదర్శుల సహకారం బాగా ఉందట.
మ్యూచువల్ అండర్ స్టాండింగ్తోనే ఇచ్చాం
గతంలో ఇచ్చిన డిప్యుటేషన్ల వల్ల శాఖ మొత్తం అభాసుపాలైందనే విమర్శలతో ఈసారి ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తలు పడ్డాం. అయితే కొంత మంది కార్యదర్శులకు మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌తో డిప్యుటేషన్ ఇచ్చారం. దీనికి తోడు కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రికమండ్ చేయడం వల్ల కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి డిప్యుటేషన్లు ఇచ్చాం. ఈ విషయంలో ఎవరిని కూడా బలవంతంగా మరో గ్రామానికి పంపలేదు.
-శంకర్ నాయక్, డీపీవో నల్లగొండ