ప్రియమైన చిన్న, చిట్టి బొద్దింకలకు, మీ కంటే కొద్దిగా ఎక్కువ జీవితానుభవం, ముఖ్యంగా రాజకీయాల అవగాహన ఉన్న సీనియర్‌గా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని అనుకొంటున్నాను. మొట్టమొదటగా మీ చైతన్యానికి నా జోహార్లు, ఒక్క పిలుపునకు స్పందించి లక్షలాదిగా తరలివచ్చిన మీ ధైర్యానికి కూడా నా అభినందనలు, ఏ దేశంలో అయినా యువత కదిలితే పెద్దవారు కండ్లు తెరుస్తారు. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం మన దేశం జనాభాలో నంబర్‌వన్‌గా ఉండటమే కాదు, దేశ జనాభాలో 45% శాతం యువతే ఉండటం ఒక ప్రత్యేకమైన ప్రయోజనం. అదీకాక రాజకీయ నాయకులు ఈ రోజు ఏ విధానాలు ప్రవేశపెట్టినా, ఏ నిబంధనలు విధించినా, అవి దశాబ్దాల తరబడి పాటించవలసినది, వాటి లాభనష్టాలు భరించవలసినది మీ తరాలే! అందుకే అపమార్గాలు అనుసరిస్తూ, ప్రజలకు ప్రమాదకరమైన పరిస్థితులు సృష్టిస్తున్న అధికార పార్టీలను మీరు ముందుచూపుతో నియంత్రించటం ఎంతో అవసరం.
ఇక ప్రస్తుత పరిస్థితులకు వస్తే, అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత నిబద్ధత ఉండాలి. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థల కంటే ఎక్కువగా ఉండాలి. 30-40 శాతం మాత్రం ఉండవలసిన ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ కూడా ఉండాలి. ఇప్పుడు 2014 నుంచీ మనదేశ పరిస్థితి భిన్నంగా ఉన్నది. ప్రభుత్వ సంస్థలు కూడా ప్రైవేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్లిపోయాయి. అంతేకాదు, ప్రభుత్వంలో ఉన్న నాయకులే ఆ వ్యాపారస్థులకు గులాములైపోయారు. ఈ స్థితి మారాలి.
రెండో విషయం, మీ మొదటి డిమాండ్‌కు సంబంధించినది. కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరారు, మీ ఒత్తిడితో కేంద్రం దిగిరాకతప్పలేదు. ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. కానీ ఇలాంటి మరో నేత ఆ పదవిలోకి వస్తారు. అసలు రాజీనామా చేయాల్సింది, వీళ్లందరి బాస్. ఆ బాస్ రాజీనామాను కోరాల్సిన అవసరమున్నది. 2014 నుంచి భారతదేశంలో విద్య చాలా దెబ్బతిన్నది. అంతకుముందు ప్రపంచ స్థాయిలో 100 లోపు ర్యాంకులు తెచ్చుకున్న ఐఐటీలు, ఐఐఎంలు కూడా 800 ర్యాంకులోకి పడిపోయాయి. కాబట్టి సరైన విద్యారంగ నిపుణులు మాత్రమే ఈ రంగానికి కావలసిన సేవలందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. మూడవ విషయం, మీ ఉద్యమ భద్రత గురించి జాగ్రత్త పడాలి. కాంగ్రెస్, ఇంక ఏ ఇతర రాజకీయ పార్టీ మిమ్మల్ని సమర్థించినా, సహాయం చేసినా తీసుకోండి. కానీ ఏ రాజకీయ నాయకుడిని, రాజకీయ పార్టీని నమ్మకండి. ఏ పార్టీలోనూ చేరకండి. ఐదేండ్లు, అంతకుమించి రాజకీయాల్లో ఉండి, ఒక్కసారైనా గెలిచిన పార్టీ అయితే, వారి పాలన ఎలా ఉండిందో నిశితంగా గమనించండి. ముఖ్యంగా ఆ పార్టీ ముఖ్యనాయకులు, వారి విధానాలు ఎట్లా ఉన్నాయో విశ్లేషించండి. అసలు ఏ పార్టీలోనూ కలవకుండా మీ గుర్తింపు కాపాడుకోండి. ఇలా వేరుగా ఉంటేనే మీరు అం శాల మీద ఉద్యమం చేయగలరు. ఎవరినైనా నిష్పక్షపాతంగా చూడగలరు. ము ఖ్యంగా అబద్ధాలు చెప్పే నాయకులను నమ్మకండి.
నాలుగో విషయం మన దేశానికి దశాబ్దాలుగా కొరవడినది. ఇంత జనాభా ఉన్నా ఎందుకు మనకు మేధావులు ఆ నిష్పత్తిలో లేరు? ఆలోచించండి. ఇంత చైతన్యం, ధైర్యం ఉన్న మీలో చాలామంది మేధావులుగా దేశానికి అవసరం. మన అనుభవంలో ఒక విచిత్రమైన విషయం గమనించండి. మేధావులుగా చెలామణి అయిన ఉన్నత విద్యావంతులు కూడా తమకు పరిచయమున్న నాయకుడెవరైనా గెలవగానే పదవుల మీద దురాశ పెరిగి రాజకీయాలలో చేరుతున్నారు. అక్కడ కానీకి చెల్లకపోయినా, ఆ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ అక్కడే పడి ఉంటున్నారు. నిజానికి సమాజంలో నిజమైన మేధావులు, నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు ఉంటేనే ఆ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అందుకని మీలో కొద్దిమంది నాయక లక్షణాలు ఉన్నవాళ్లు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లినా, మీ నిబద్ధత నిలుపుకోండి. సామాన్య ప్రజల జీవితాలు బాగు చెయ్యటానికి శ్రమపడండి. ఇక చాలామంది ఉన్నత విద్య పొంది, ఉద్యోగమో, ఉపాధో ఏర్పరచుకున్నాక, మేధావులుగా ఎదగండి, సమాజాన్ని చైతన్యపరచండి. అందుకు మాలాంటి వారి ఆశీర్వచనాలు ఎప్పుడూ మీకు ఉంటాయి. అభినందనలతో.. మీ
– కనకదుర్గ దంటు,
89772 43484