న్యూఢిల్లీ : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)గా కే సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రమాణం చేయించారు. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు అధికారి ఆయన. 1989 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా పని చేశారు. కాగ్‌గా గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఆయన స్థానంలో సంజయ్‌ని నియమించినట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. సంజయ్ మూర్తి ఏపీలోని కోనసీమలో 1964 డిసెంబరు 24న జన్మించారు. ఆయన తండ్రి కేఎస్ఆర్ మూర్తి కూడా ఐఏఎస్ అధికారి. సంజయ్ 2021 నుంచి కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు.