Jyoti Malhotra | గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇక ఈ కేసు దర్యాప్తు ముమ్మురంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో డిలీట్ అయిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రికవరీ చేస్తున్నారు. దాదాపు 12 టెరా బైట్ల డేటాను రికవరి చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
‘జ్యోతి మల్హోత్రాకు చెందిన మూడు ఫోన్ల నుంచి 12 టెరా బైట్ల డేటాను స్వాధీనం చేసుకున్నాం. రికవరీ చేసిన డిజిటల్ డేటాను పరిశీలిస్తున్నాము. ఆమె ల్యాప్‌టాప్‌లోని డేటాను ఇంకా పరిశీలించాల్సి ఉంది’ అని సీనియర్ పోలీసు అధికారిని ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. అదేవిధంగా జ్యోతి మల్హోత్రా నాలుగురు పాకిస్థానీ నిఘా ఏజెంట్లతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు కూడా తేలింది. వీరిలో ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌ను సందర్శించినప్పుడు పరిచయమైన డానిష్, అహ్సాన్, షాహిద్ ఉన్నారు. దీంతో పాక్ భద్రతా సంస్థలో వీరి పాత్ర గురించి అధికారులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దర్యాప్తులో భాగంగా పాక్ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థాన్ పర్యటనలో అక్కడి అధికారులు ఆమెకు రాచమర్యాదులు చేసినట్లు తెలిసింది. లాహోర్‌లోని అనార్కలీ బజార్ని సందర్శించిన సమయంలో యూట్యూబర్‌కు ఏకంగా ఆరుగురు గన్మెన్లు ఏకే 47తో భద్రత కల్పించినట్లుగా తేలింది. స్కాట్లాండ్కు చెందిన ఓ యూట్యూబర్ వీడియోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జ్యోతికి కల్పించిన సెక్యూరిటీని చూసి స్కాట్లాండ్ యూట్యూబర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘కాలమ్ అబ్రాడ్’ అనే యూట్యూబర్ స్కాటిష్ పౌరుడు కాలమ్ మిల్ గత మార్చి నెలలో పాక్‌లో పర్యటించారు. లాహోర్‌లోని ప్రసిద్ధ అనార్కలీ బజార్లో తిరుగుతుండగా.. అక్కడ కొందరు తుపాకులతో కనిపించారు. వారి చొక్కాలపై ‘నో ఫియర్’ అని రాసి ఉంది.
స్కాటిష్ యూట్యూబర్ విడుదల చేసిన తాజా వీడియోలో ఆయన పాకిస్థాన్‌లోని అనార్కలి బజార్లో జ్యోతి మల్హోత్రాతో మాట్లాడుతున్నారు. ఇందులో ఆమె ‘మొదటిసారి పాకిస్థాన్ వచ్చారా’ అంటూ కల్లమ్‌ను ప్రశ్నిస్తున్నది. ‘లేదు.. ఇది ఐదోసారి’ అంటూ ఆయన సమాధానమిచ్చారు. తాను ఇండియన్‌ను అంటూ ఆమె పరిచయం చేసుకుంది. అయితే పాకిస్థాన్ ఆతిథ్యం గురించి జ్యోతిని కల్లమ్ ప్రశ్నించగా గొప్పగా ఉందంటూ ఆమె సమాధానమిచ్చింది. అయితే ఆమె వెంట ఆరుగురు సాయుధులైన పోలీసులు ఉండడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన చెప్పుకొచ్చాడు.
Also Read..
Flipkart | ఈ ఏడాది 5 వేల నియామకాలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ఇ-కామర్స్ దిగ్గజం
BSF | పాక్‌లో 2.2 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి దాడులు.. భారత్ దెబ్బకు పారిపోయిన పాక్ రేంజర్లు