న్యూఢిల్లీ, నవంబర్ 9: న్యాయం అనేది కొద్ది మందికి మాత్రమే దక్కే ప్రత్యేకాధికారం కాదని, అది అందరికీ దక్కే హక్కని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. సమాజంలోని అంచులలో నిలబడి ఉన్న చివరి వ్యక్తికి కూడా న్యాయం వెలుగు చేరేలా చూడటం న్యాయమూర్తులు, న్యాయవాదుల విధి అని ఆయన నొక్కి చెప్పారు. మీరు ఒక్క రోజు ఏదైనా గ్రామాన్నో, జైలునో సందర్శించి అక్కడి వారితో మాట్లాడండి.
అప్పటి వరకు ఎవరూ తమ వద్దకు రాని, బాధలో ఉన్న ఆ వ్యక్తుల జీవితాన్ని మీ మాటలు మార్చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందరికీ న్యాయ సహాయం, న్యాయం అందుబాటులోకి తీసుకురావడంలో శాసనసభ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉమ్మడి బాధ్యత ఉందన్న విషయాన్ని ప్రధాని మోదీ ఈ సభకు హాజరు కావడం పునరుద్ఘాటిస్తున్నదని సీజేఐ అన్నారు.
న్యాయం పొందే అవకాశం అనే భావన ఒక నిర్జీవమైన, కల్పిత సిద్ధాంతం కాదని, అది నిరంతరం సంరక్షించాల్సిన సంస్థాగత బలం, వృత్తి నైపుణ్యం, కరుణతో కూడిన సంబంధాల ద్వారా పోషించాల్సిన ఒక వివేకవంతమైన హక్కు అని ఈ నెలలో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సూర్య కాంత్ అన్నారు.
‘న్యాయాన్ని అందించే విధానాన్ని పటిష్ఠం చేయడం’ అనే జాతీయ సదస్సు ముగింపు సమావేశంలోప్రసంగిస్తూ న్యాయ సహాయ విభాగం (నల్సా) చేపట్టిన కొత్త కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ వ్యవస్థ వ్యక్తిగతంగా, తరచుగా, విభిన్నంగా జరిగే న్యాయ ప్రతినిధిత్వ విధానాన్ని వదిలి బాధ్యతాయుతమైన రక్షణ వ్యవస్థ వైపు మార్పుకు సూచిక అని అన్నారు.