కొచ్చి: ‘విచారణ ఖైదీకి బెయిల్ మంజూరు చేయడం ఓ నిబంధన, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వారిని జైలుకు పంపించవచ్చు’ అనేది ఓ సూత్రం అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. గత కొంత కాలం నుంచి ఈ సూత్రాన్ని కోర్టులు పాటించడం లేదన్నారు. ఇటీవల మరుగునపడిన ఈ సూత్రాన్ని ప్రముఖ జర్నలిస్ట్ ప్రబిర్ పుర్కాయస్థ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుల్లో పునరుద్ఘాటించే ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. కొచ్చిలో ఆదివారం జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విచారణ లేకుండా సుదీర్ఘ కాలంపాటు విచారణ ఖైదీలను జైళ్లలో ఉంచరాదని జస్టిస్ కృష్ణ అయ్యర్ చెప్పారని జస్టిస్ గవాయ్ తెలిపారు.
‘బెయిల్ ఈజ్ ది రూల్, జైల్ ఈజ్ ది ఎక్సెప్షన్’ అనే దానిని ఉపయోగించకూడని నిషిద్ధ సూత్రంగా పరిగణించేవారని, ఆ సూత్రాన్ని గట్టిగా సమర్థించడం ద్వారా కృష్ణయ్యర్ భారతీయ న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయాన్ని లిఖించారని చెప్పారు. గత కొంత కాలంగా ఈ సూత్రాన్ని కొంత వరకు మర్చిపోయారన్నారు. 2024లో ఈ చట్టబద్ధ సూత్రాన్ని పునరుద్ఘాటించే అవకాశం తనకు దక్కిందని చెప్పడానికి సంతోషంగా ఉందని తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో సరైన ఆధారాలు లేకుండానే మనీశ్ సిసోడియా, కవితలను ఈడీ అరెస్ట్ చేసింది. వీరి బెయిల్ దరఖాస్తులను జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనాలు విచారణ జరిపాయి. దర్యాప్తు సంస్థల తీరును ఎండగడుతూ బెయిల్ మంజూరు చేసింది.