న్యూఢిల్లీ, మే 19: లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన కచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని కేంద్ర ఎన్నికల సంఘం తన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా చెప్పిందని పూనమ్ అగర్వాల్ అనే ఓ జర్నలిస్టు శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇదే ప్రశ్నతో రాష్ర్టాల ఎన్నికల ప్రధానాధికారులకు ప్రత్యేక దరఖాస్తులు చేయాలని ఈసీ సూచించిందని తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో నాలుగు దశల పోలింగ్ వివరాలను ఈసీ వెల్లడించిందని, అయితే ఇప్పుడు తమ వద్ద సమాచారం లేదని చెబుతున్నదని అన్నారు. మరోవైపు పోలైన ఓట్ల వివరాలను తెలియజేసే ‘ఫారం 17సీ’ను అప్లోడ్ చేసేందుకు కొంత సమయం తీసుకొంటామని సుప్రీంకోర్టుకు తెలిపిందని అగర్వాల్ తన పోస్టులో పేర్కొన్నారు.
దీనిపై సంజీవ్ గుప్తా అనే మాజీ ఐఏఎస్ ఎక్స్‌లో స్పందిస్తూ.. ఈసీ తమను తాము కష్టపెట్టదలచుకోవాలని అనుకోవడం లేదా? అని అన్నారు. పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్లకు సంబంధించి ఫారం 17సీ డాటా ఎన్నికల సంఘానికి చెందిన ఎన్కోర్ వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లో నమోదు అవుతుందని పేర్కొన్నారు. ఒక్క బటన్‌ను నొక్కే దూరంలో సమాచారం అందుబాటులో ఉండగా.. పోలైన ఓట్లకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తమ వద్ద లేవని ఎలా చెబుతారని ప్రశ్నించారు.