న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో వీధి కుక్కలు కనిపించకూడదని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. శునకాలను స్టెరిలైజ్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే ఆ తీర్పును బాలీవుడ్ స్టార్స్ వ్యతిరేకించారు. సెలబ్రిటీలు భిన్న స్వరాన్ని వినిపించారు. కుక్క కాటు దాడులు, రేబిస్ కేసులు పెరగడం వల్ల సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. కానీ ఫిల్మ్ స్టార్ జాన్ అబ్రహం(John Abraham) ఆ తీర్పును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సీజేఐ బీఆర్ గవాయ్‌కు ఆ హీరో అపీల్ చేశాడు. ఢిల్లీ కుక్కల విషయం ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని తన లేఖలో అబ్రహం కోరారు.
ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలు కాదు అని, అవి కమ్యూనిటీ డాగ్స్ అని, ఎంతో మంది వాటిని గౌరవిస్తారని, అవి ఢిల్లీ ప్రజల సొంతం అని, కొన్ని తరాలుగా ఆ జంతువులు అక్కడ జీవిస్తున్నట్లు జాన్ తన లేఖలో తెలిపారు. జంత సంరక్షకుడిగా కొన్ని దశాబ్ధాలు పనిచేశానని, సుప్రీం ఇచ్చిన ఆదేశాలు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కుక్కల తరలింపును ఏబీసీ రూల్స్ నిషేదిస్తాయన్నారు. కానీ ఆ శునకాలకు స్టెరిలైజ్, వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నారు. ఏబీసీ ప్రోగ్రామ్‌ను చాలా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారని, జైపూర్‌లో 70 శాతం కుక్కలను స్టెరిలైజ్ చేశారని, లక్నోలో 84 శాతం చేశారన్నారు. ఢిల్లీలో కూడా ఇలాగే చేయవచ్చు అని జాన్ అబ్రహం తెలిపారు. జస్టిస్ పర్దివాలా, మహాదేవన్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించి, ఆ తీర్పును మార్చాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు వరున్ ధావన్, జాన్వీ కపూర్ కూడా సుప్రీం ఆదేశాలకు విరుద్దంగా నిలిచారు. సుప్రీం ఆదేశాలు కుక్కలకు మరణశాసనంగా మారిందన్నారు.