తెలంగాణ వస్తే నిరుద్యోగం తాండవిస్తుందని, ఉపాధి కల్పన మృగ్యం అవుతుందని దుష్ప్రచారం చేసిన వారికి చెంపపెట్టులాంటి వార్త ఇది.
కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల ఖిల్లాగా మారిందని మరోసారి తేటతెల్లమైంది. ఇదేదో స్థానిక సర్వేలు చెప్పిన విషయంకాదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తాజా నివేదికలో తేల్చిచెప్పిన నిజాలివి.
Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెద్దయెత్తున పెరిగినట్టు ఐఎల్వో నివేదిక తెలిపింది. 2019లో ఉపాధి కల్పనలో 16వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2022 నాటికి మూడో ర్యాంకుకు ఎగబాకినట్టు వెల్లడించింది. 0.6 స్కోర్‌తో తెలంగాణ ఈ ఘనత సాధించినట్టు వివరించింది. అంతేకాదు దక్షిణ భారత దేశంలో ఎక్కువ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలిగిన రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. పురుషులకు సంబంధించి ఉపాధి అవకాశాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడం విశేషం. ఉపాధి కల్పన జాబితాలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న గుజరాత్ 5, ఉత్తరప్రదేశ్ 19 స్థానాల్లో నిలిచాయి. ఐఎల్వో, ఇన్స్టిట్యూట్ ఆప్ హ్యూమన్ డెవలప్మెంట్(ఐహెచ్డీ)ఈ నివేదికను ప్రచురించాయి.
గత కాంగ్రెస్ కంటే ఎంతో మిన్న: 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఏపీలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 24,086 మాత్రమే. అందులో తెలంగాణ 10 జిల్లాల వాటా 42 శాతం అనుకుంటే.. మనకు దక్కినవి కేవలం 10,080 ఉద్యోగాలే. అదే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. అంటే 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 2.32 లక్షలు. ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 23 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసింది. గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏడాదికి సగటున వెయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే.. బీఆర్ఎస్ పాలనలో 2014 తర్వాత ఏడాదికి సగటున 23 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఏ లెక్కన తీసుకున్నా బీఆర్ఎస్ సర్కారు భర్తీ చేసిన ఉద్యోగాలతో పోలిస్తే కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు దరిదాపులో కూడా ఉండవు. ప్రభుత్వ రంగంలోనే కాదు అటు ప్రైవేటు రంగంలో కూడా గత పదేండ్ల వ్యవధిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 17 లక్షల ఉద్యోగాలను సృష్టించి ఉపాధి కల్పనలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపింది.