Unemployment | న్యూఢిల్లీ, నవంబర్ 21: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో దేశంలో నిరుద్యోగం భారీస్థాయిలో పెచ్చరిల్లుతున్నది. దేశంలో ఉద్యోగ కల్పన లేమిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) సోమవారం విడుదల చేసిన కొత్త సబ్స్రైబర్లకు(పేరోల్ డాటా) సంబంధించిన గణాంకాలు స్పష్టం చేశాయి. సెప్టెంబర్లో సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన ఆరు నెలల కనిష్ఠానికి చేరిందని పేర్కొన్నది. ఆగస్టు నెలలో 9,53,092 మంది కొత్త సబ్స్ర్కైబర్లు నమోదు కాగా, అది సెప్టెంబర్లో 6.45 శాతం పడిపోయి 8,91,583 మంది సబ్స్ర్కైబర్లు నమోదయ్యారని వెల్లడించింది.
తగ్గిన మహిళల భాగస్వామ్యం
కొత్త ఈపీఎఫ్ సబ్స్ర్కైబర్లలో మహిళల శాతం కూడా దారుణంగా పడిపోయింది. ఆగస్టులో 26.12 శాతం (2,48,980) ఉండగా, సెప్టెంబర్లో 25.3 శాతానికి(2,26,392 మంది) దిగజారింది. మరోవైపు 18-28 ఏండ్ల మధ్య వయస్కుల భాగస్వామ్యం స్వల్పంగా ఒక్క శాతం పెరిగింది. కాగా, భారతదేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకొన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) నివేదిక ఇటీవల వెల్లడించింది.