Kalpana Soren | గత డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని జేఎంఎం నాయకురాలు, ఎమ్మెల్యే కల్పనా సోరెన్ మండి పడ్డారు. గోలా జిల్లా రాంగఢ్లో శనివారం జరిగిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా బీజేపీ అడ్డుకుంటున్నదని ఆరోపించారు. మైయ్యా సమ్మాన్ యోజన పథకంపై బీజేపీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యా్జ్యాన్ని కొట్టివేస్తూ జార్ఖండ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
హేమంత్ సోరెన్ సారధ్యంలోని జార్ఖండ్ ప్రభుత్వం గిరిజనులు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం మైయా సమ్మాన్ యోజన, అబువా అవాస్ యోజన, సర్వజన్ పెన్షన్ వంటి అమలు చేస్తున్నదని కల్పనా సోరెన్ పేర్కొన్నారు. హేమంత్ సోరెన్ సర్కార్ పంట రుణాలు మాఫీ చేసిందని చెప్పారు. 40 లక్షల మంది ప్రజలకు సర్వజన్ పెన్షన్ పథకం అమలు చేస్తుండగా, 25 లక్షల కుటుంబాలకు ఇంటి వసతి కల్పనకు అబువా అవాస్ యోజన పథకం అమలు చేసిందన్నారు.