Landmine Blast | జమ్మూ కశ్మీర్లోని అకునూర్ సెక్టార్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) పొడవునా ఏర్పాటు చేసిన మందు పాతర పేలడంతో ఒక అధికారితోపాటు ఇద్దరు సైనికులు మృత్యువాత పడ్డారు. సరిహద్దు ఫెన్సింగ్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న జవాన్లు మందుపాతరపై కాలు మోపడంతోనే పేలి ఉంటాయని రక్షణశాఖ అధికార ప్రతినిధి అనుమానం వ్యక్తం చేశారు.
భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు సైనికుల త్యాగానికి నైట్ కార్ప్స్ నివాళులర్పించారని రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. మృతుల్లో ఒకరు కెప్టెన్ ర్యాంక్ అధికారి అని తెలిపారు.
ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన మందు పాతర పేలిందా..? ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన మందు పాతర పేలిందా? అన్న సంగతి తెలియరాలేదన్నారు. గతవారం రాజౌరీ ప్రాంతంలో ఎల్వోసీ మీదుగా చొరబాట్లకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఐదుగురు ఉగ్రవాదులు మందు పాతర పేలడంతో మరణించారని రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. గతవారం ఫూంచ్ జిల్లా పరిధిలోనూ మందు పాతర పేలిందని, దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయని, చొరబాట్ల ముప్పు తొలగిపోయిందన్నారు.