న్యూఢిల్లీ, ఆగస్టు 4 : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడంతో జమ్ము కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించే విషయమై వీరు సమావేశం అయి ఉంటారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. జమ్ము కశ్మీరుకు చెందిన బీజేపీ అధ్యక్షుడితోపాటు మరి కొందరు నాయకులతో అమిత్ షా విడిగా సమావేశం కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఆరేళ్ల క్రితం ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి జమ్ము కశ్మీరును కేంద్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది.
ప్రధాని మోదీ మంగళవారం ఎన్డీఏ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సవం జరగడానికి ముందు జరుగుతున్న ఈ వరుస సమావేశాల కారణంగా ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ముతో సమావేశమయ్యారు. ఈ భేటీ వివరాలు వెల్లడి కాకపోవడం గమనార్హం. రాష్ట్రపతితో మోదీ భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే హోం మంత్రి అమిత్ షా కూడా రాష్ట్రపతితో భేటీ అయ్యారు.