శ్రీనగర్, ఆగస్టు 26: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకంపై ఓ అంగీకారం కుదిరింది. ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో 51 స్థానాల్లో ఎన్సీ, 32 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతున్నట్టు ఇరు పార్టీల నేతలు సోమవారం ప్రకటించారు. మరో ఐదు స్థానాల్లో రెండు పార్టీలూ స్నేహపూర్వక పోటీకి దిగనున్నాయి. మరోవైపు, 44 మందితో తొలుత జాబితాను ప్రకటించిన బీజేపీ.. పార్టీలో వ్యతిరేకత రావడంతో దానిని ఉపసంహరించుకుంది. 16 మందితో మళ్లీ జాబితాను విడుదల చేసింది.
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు. ‘జన్సర్, ద్రాస్, శామ్, నుబ్ర, చాంగ్‌తంగ్ పేర్లతో ఏర్పడే కొత్త జిల్లాలు పరిపాలనను ప్రతి మూలకు తీసుకెళ్తాయి’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌ను 2019లో విభజించి.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు.