Jharkhand | ధన్‌బాద్ : జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ ‘శిక్ష’ పేరుతో చేపట్టిన చర్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ చొక్కాలపై సందేశాలు రాసుకున్నందుకు 80 మంది పదో తరగతి విద్యార్థినుల చేత ఆయన చొక్కాలు విప్పించి వారిని బ్లేజర్ల(కోటు లాంటిది) తోనే ఇండ్లకు పంపించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో జిల్లా యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. దిగ్వాడీలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు ధన్‌బాద్ డిప్యుటీ కమిషనర్(డీసీ) మాధవీ మిశ్రా తెలిపారు. పదో తరగతి విద్యార్థినులు పరీక్ష రాసిన తర్వాత ఒకరి షర్టుపై మరొకరు సందేశాలు రాసుకుని పెన్ డే జరుపుకున్నారని బాలికల తల్లిదండ్రులు డీసీకి తెలిపారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులు క్షమాపణ చెప్పినప్పటికీ ప్రిన్సిపాల్ ఆగ్రహం చల్లారలేదని.. బాలికల చేత బలవంతంగా షర్టులు విప్పించి అందరినీ బ్లేజర్పైనే ఇండ్లకు పంపించారని బాధితుల తల్లిదండ్రులు డీసీకి ఫిర్యాదు చేశారు. తాను విద్యార్థినులతో మాట్లాడానని.. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు డీసీ చెప్పారు.