రాంచి: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పత్రాల పంపిణీ కోసం బూత్ స్థాయి అధికారిణి (బీఎల్వో) డబ్బులు డిమాండ్ చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. దీనితో పాటు డబ్బులు తీసుకుని ‘సర్’ ఫారాలు నింపుతున్న సైబర్ కేఫ్‌పై ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. (BLO seeking money for SIR forms) జార్ఖండ్‌లో ఈ సంఘటన జరిగింది. గర్వా జిల్లాలో బీఎల్వోగా విధులు నిర్వహిస్తున్న జమీలా బీబీ, ‘సర్’ ఫారాల పంపిణీ, పూరించడం, స్వీకరించడం కోసం రూ. 50 నుంచి రూ.100 వరకు డిమాండ్ చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. డబ్బు చెల్లించని వారిని ఆమె బెదిరించినట్లు మీడియాకు వెల్లడించారు. అలాగే ‘సర్’ ఫారాలు నింపడానికి ఇంటర్నెట్ సెంటర్లకు చెందిన కొందరు వ్యక్తులు రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
కాగా, ఈ సంఘటనల వీడియో క్లిప్స్ వైరల్ కావడంతో జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కె. రవి కుమార్ స్పందించారు. ‘సర్’ ఫారాల పంపిణీ, స్వీకరణకు మహిళా బీఎల్వో ప్రజలను డబ్బులు అడిగిన వీడియోపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని గర్వా డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే ఓటర్ల వివరాల నమోదు ఫారాలు నింపడానికి ప్రజల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన ధన్‌బాద్‌లోని ఒక సైబర్ కేఫ్‌కు అధికారులు సీల్ చేసినట్లు వివరించారు. అలాంటి వ్యక్తులు, ఆపరేటర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.