రాంచి: ఒక వ్యక్తి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు గ్రామ పంచాయతీ పెద్దలు ప్రయత్నించారు. నిందితుడికి లక్ష జరిమానా విధించారు. అతడు చెల్లించిన కొంత డబ్బుతో మందు పార్టీ జరుపుకున్నారు. (Panchayat Punishment) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామానికి చెందిన సునీల్ లోహారా, శనివారం సాయంత్రం ఒక ఇంటికి వెళ్లాడు. ఒక మహిళ ఇంటి పనులు చేసుకుంటుండగా ఆమె మూడేళ్ల కుమార్తెను తన వద్ద ఉంచుతానని చెప్పాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని మరో గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కాగా, ఆ బాలిక ఏడ్పు విన్న తల్లి పరుగున వచ్చింది. గాయాలతో ఏడుస్తున్న ఆ చిన్నారిని ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా లైంగిక దాడి జరిగినట్లు బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేయనీయకుండా నిలువరించారు. ఆదివారం గ్రామంలో పంచాయతీ నిర్వహించి నిందితుడికి లక్ష జరిమానా విధించారు. అందులో రూ.20,000 అతడు చెల్లించగా మాంసం, మద్యంతో విందు ఏర్పాటు చేశారు. మిగతా రూ.80,000 వారం రోజుల్లోగా చెల్లించాలని నిందితుడికి సూచించారు.
మరోవైపు కొందరు గ్రామస్తుల ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో ఘాఘ్రా పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి చిన్నారి తల్లి నుంచి వివరాలు సేకరించారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. కొంత జరిమానా డబ్బుతో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న నిందితుడు సునీల్‌ను అరెస్ట్ చేశారు.
అయితే చిన్నారిపై లైంగిక దాడి ఘటన తర్వాత పాల్మా గ్రామంలో ఒక సమావేశం జరిగిందని ఆరంగి పంచాయతీ ప్రెసిడెంట్ లోడో ఎక్కా తెలిపారు. ఆ సమావేశం గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. పోలీసులు గ్రామంలోకి వచ్చిన తర్వాతే దీని గురించి తనకు తెలిసిందని ఆయన అన్నారు.