న్యూఢిల్లీ: మనీలాండరింగ్ (Money Laundering) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనకు సమన్లు జారీచేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (CM Hemanth Soren) సుప్రీంకోర్టు (Supreme court) మెట్లెక్కారు. భూకుంభకోణం కేసులో ఆగస్టు 14న తమ ముందు విచారణకు హాజరు కావాలని సోరెన్‌కు ఈ నెల 7న ఈడీ నోటీసులు (Summons) జారీచేసింది. అయితే ఆరోజున బిజీ షెడ్యూల్ ఉండటంతో తాను విచారణకు హాజరుకాలేనని ఆయన చెప్పారు. దీంతో ఈ నెల 24న విచారణకు రావాలని మరోసారి సమన్లు జారీచేసింది. అయితే ఆయన ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. తాను సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నట్లు ఇప్పటికే ఈడీ డైరెక్టర్‌కు జార్ఖండ్ ముఖ్యమంత్రి లేఖ కూడా రాశారు.
తాను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని సోరెన్ వ్యాఖ్యానించారు. ఈడీ సమన్లు జారీచేసిన విధానం చూస్తే తానేదో దేశం విడిచి పారిపోతున్నట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌తోపాటు మరో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి హేమంత్ సోరెన్‌ను గతేడాది నవంబర్ 17న ఈడీ తొమ్మిది గంటలకుపైగా విచారించింది. ఇవే ఆరోపణలపై ఇప్పటికే ఐఏఎస్ అధికారి ఛవీ రంజన్, ఇద్దరు వ్యాపారవేత్తలు కోల్‌కతాకు చెందిన అమిత్ అగర్వాల్, రాంచీలో షాపింగ్ మాల్స్‌ను కలిగి ఉన్న బిష్ణు అగర్వాల్‌తో సహా 13 మందిని అరెస్టు చేసింది.