కొత్తగూడెం ప్రగతి మైదాన్ : మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకరపోరులో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం.. బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలోని లుగు గుట్టల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీస్ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య దాదాపు రెండున్నర గంటలపాటు కాల్పులు కొనసాగాయి.
ఘటనా స్థలం నుంచి 8 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఎకే-47, ఇన్సాస్ రైఫిల్, ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ అలియాస్ ఫుచన అలియాస్ నాగ మాంఝీ అలియాస్ కరణ్ అలియాస్ లెతరతోపాటు రూ.25 లక్షల రివార్డు ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అరవింద్ రావ్, రూ.10 లక్షల రివార్డు ఉన్న జోనల్ కమిటీ సభ్యుడు సాహెబ్రామ్ మాంఝీ ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. వివేక్ ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగించేవాడని, జార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో జరిగిన పలు దాడుల్లో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు.