న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలోని విపక్షాలను ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30న ముగియనుంది. ఈ నేపథ్యంలో యాత్ర ముగింపు సభ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగనుంది. దీంతో దేశంలో భావసారూప్యత కలిగిన 24 రాజకీయ పార్టీలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానించారు. 30న జరిగే జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనాల్సిందిగా లేఖలు రాశారు. అయితే ఖర్గే ఆహ్వానాన్ని బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ తిరస్కరించింది.
తాము అదే రోజున పార్టీకి అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందని జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజివ్ రంజన్ సింగ్ స్పష్టం చేశారు. నాగాలాండ్‌లో పార్టీ తరపుణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అందువల్ల తాము భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొనలేకపోతున్నామని ఖర్గేకి లేఖ రాశారు. దీంతో 2024 ఎన్నికలకంటే ముందే బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావడం సాధ్యమేనా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.