Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ సారధ్యంలోనే 2005 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతామని జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ ఝా స్పష్టం చేశారు. నితీష్ ఆరోగ్యంగా ఉన్నారని, లోక్‌సభ ఎన్నికల్లో ఆయన హుషారుగా ప్రచారం చేపట్టారని, అభివృద్ధి పనులు చేస్తున్నారని వివరించారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి నితీష్ కుమార్ పట్ల రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసం కనబరుస్తున్నారని విస్పష్ట సంకేతం వెల్లడైందని చెప్పారు. నితీష్ కుమార్ రాజకీయాలకు కాలం చెల్లిందని ఎవరు అనుకున్నా అందుకు భిన్నమైన ఫలితాలు వెల్లడవుతున్నాయని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా 177 స్ధానాల్లో ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యం లభించిందని గుర్తుచేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయానికి ఇది సంకేతమని చెప్పుకొచ్చారు. తాము ఐక్యంగా లోక్‌సభ ఎన్నికల్లో మాదిరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పనిచేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కులం కార్డు కొంతమేర పనిచేసినా ఫలితాలపై సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రధానంగా ప్రభావం చూపుతాయని అన్నారు. నితీష్ కుమార్ సారధ్యంలో ఎన్డీయే కూటమి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :
Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసు.. జాక్వెలిన్‌కు మరోసారి సమన్లు పంపిన ఈడీ