పట్నా : మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరడంతో కాషాయ పార్టీ ప్రలోభాలకు పాల్పడుతోందని జేడీ(యూ) విరుచుకుపడింది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో తాజా పరిణామాలు పాలక పార్టీ నిర్వాకాలను ఎత్తిచూపుతున్నాయని జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ అన్నారు.
2024లో దేశం జుమ్లేబాజ్ ముక్త్ అవుతుందని పేర్కొన్నారు. ధనబలంతో ప్రలోభాలతో జేడీ(యూ) ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని జేడీ(యూ) ప్రతినిధి నీరజ్ కుమార్ ఆరోపించారు. భాగస్వామ్య పక్షాలను వెన్నుపోటు పొడిచే బీజేపీ తీరు తేటతెల్లమైందని అన్నారు. తొలుత అరుణాచల్ ప్రదేశ్‌లో తాజాగా మణిపూర్‌లో తమ పార్టీ శాసనసభ్యులను బీజేపీ లాగేసుకుందని ఆరోపించారు.
చిన్న పార్టీలను ఎదగనీయకుండా కాషాయ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జాతీయ స్ధాయిలో జేడీ(యూ) బలీయ శక్తిగా ఎదగడాన్ని బీజేపీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని 2024లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొన్నారు.