శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పెహల్గామ్లో ఉన్న బైసరాన్లో ఉగ్రదాడి జరిగిన ఘటనలో 26 మంది పర్యాటకులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక నివాళి అర్పించారు. సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) ఆ సభలో మాట్లాడుతూ ఆ దాడిని ఖండించారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరుకు.. అరుణాచల్ నుంచి గుజరాత్ వరకు, కశ్మీర్ నుంచి కేరళ వరకు .. ఈ దాడి వల్ల అందరూ చలింపోయారన్నారు. ఇలాంటి దాడులు ఎన్నోచూశామని, అమర్నాథ్ క్యాంప్, దోహాలోని పలు గ్రామాలు, కశ్మీరీ పండిట్లు, సిక్కులపై గతంలో జరిగాయని, కానీ బైసరాన్ దాడికి ముందు చాలా గ్యాప్ వచ్చిందని, 21 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో సాధారణ పౌరులపై అటాక్ జరిగిందని సీఎం ఒమర్ అన్నారు.
పెహల్గామ్ దాడి ఘటన బాధిత కుటుంబాలకు ఎలా క్షమాపణలు చెప్పాలో అర్థం కావడం దనలేదని సీఎం అన్నారు. పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చామని, టూరిస్టులను క్షేమంగా వెనక్కి పంపడం తన బాధ్యత అని, కానీ అలా చేయలేపోయానని, క్షమాపణలు కోరేందుకు తన వద్ద మాటలు లేవని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు కూడా ఆ దాడికి సపోర్టు ఇవ్వరని, ఇది మమ్మల్ని చుట్టివేసిందని, ఈ సమయంలో ఓ ఆశా రేఖ కోసం ఎదురుచూస్తున్నామని, గత 26 ఏళ్లలో ఓ దాడిని ఖండిస్తూ ఇలా భారీ సంఖ్యలో జనం నిరసన వ్యక్తం చేయడం చూడలేదని సీఎం ఒమర్ పేర్కొన్నారు.