Jammu and Kashmir | జమ్ముకశ్మీర్‌లో అధికారాన్ని ఎలాగైనా గుప్పిట్లోకి తీసుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం కుట్రపన్నుతున్నది. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు మళ్లీ కొత్త నాటకానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలు.. బీజేపీ కుట్రలను బహిర్గతపరుస్తున్నాయి.
త్వరలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా వచ్చే అవకాశం ఉన్నదన్న కేంద్ర మంత్రి.. వెంటనే మాట మార్చి రాబోయే రోజుల్లో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిధుల గురించి ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించడం జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో కలకలం రేపింది. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై అటు బీజేపీ అధిష్టానంతోపాటు ఇటు జమ్ముకశ్మీర్ పార్టీల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్నది. నిజంగానే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వనున్నారా? అని పలువురు ప్రజాప్రతినిధులు జర్నలిస్టుల వద్ద ఆరా తీస్తూ కనిపించారు.
14వ ఆర్థిక సంఘం నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ఆమోదించారని నిర్మలా సీతారామన్ తెలిపారు. అందువల్ల, ఇవాళ పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇస్తున్నామన్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కానందున ప్రస్తుతం 41 శాతం ఇస్తున్నామని, త్వరలో రాష్ట్రంగా మారుతున్నందున ఈ శాతం పెరుగుతుందని.. చెప్తూ అసలు విషయం బయటపెట్టారు. అవినీతికి తావులేకుండా పారదర్శకతతో పని చేస్తున్నానని ఆర్థిక మంత్రి అన్నారు. నాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాలు అనే తేడా లేదని నిర్మలమ్మ చెప్పారు.