Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని (బంకర్) భద్రతా దళాలు గుర్తించాయి. అక్కడి నుంచి ఆహార పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంకర్ పాకిస్తాన్ కేంద్రంగా నడిచే జైషే మహ్మద్ సంస్థదిగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. జమ్ము-కాశ్మీర్, కిష్ట్వార్ జిల్లాలోని 12,000 అడుగుల ఎత్తున్న ప్రాంతంలో భారత భద్రతా దళాలు తీవ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించాయి.
జైషే మహ్మద్ సంస్థకు చెందినదిగా భావిస్తున్న ఈ ప్రదేశంలో వారు చాలాకాలంపాటు తలదాచుకోవడానికి కావాల్సిన సరుకుల్ని నిల్వ చేసుకున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా చలికాలం మనుగడ సాగించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ప్రదేశంలో 50 మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లు, 20 కేజీల బాస్మతి రైస్, మసాలాలు, తాజా కూరగాయలు, వంట గ్యాస్, కలప వంటివి ఉన్నాయి. వీటిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ ప్రాంతంలో చలికాలం అత్యంత స్వల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలుంటాయి. మంచు కూడా భారీ స్థాయిలో కురుస్తుంది. అందుకే ఈ వాతావరణానికి అనుగుణంగా ఉగ్రవాదులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ బంకర్ నిర్మాణం రాళ్లతో కట్టిన గోడలతో కార్గిల్ స్టైల్ లో ఉంది. అలాగే పూర్తి నిఘా ఉండేలా ఏర్పాట్లున్నాయి. అంటే ఎవరైనా అక్కడికి వస్తే మరోవైపు నుంచి పారిపోవచ్చు.
ఈ నిర్మాణం, సామగ్రికి సంబంధించి కచ్చితంగా స్థానికుల సహకారం ఉంటుందని సెక్యూరిటీ సిబ్బంది అనుమానిస్తున్నారు. పాక్ ఉగ్రవాది, జైషే మహ్మద్ కమాండర్ సైఫుల్లా, డిప్యూటీ కమాండర్ అదిల్ ఈ స్థావరాన్ని వాడుకుంటున్నట్లు భావిస్తున్నారు. స్థానిక సోనార్ గ్రామం, మండ్రల్ సింగ్ పోరా ప్రాంతంలో ఆదివారం పోలీసులు యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేపట్టగా.. ఈ బంకర్‌ను గుర్తించారు. ఇదే సమయంలో ఇక్కడ ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిది సిబ్బంది గాయపడగా, ఒకరు మరణించారు.