శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ప్రస్తుతం జరుగుతున్న అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది. దీంతో ఆ తర్వాతే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. జమ్ముకశ్మీర్‌లో 370, 35ఏ ఆర్టికల్స్ రద్దు చేసిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో తయారీకి బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను తిరిగి భారత్ స్వాధీనం చేసుకొనే అంశం ఇందులో ప్రధానంగా ఉంటుందని భావిస్తున్నారు. గురువారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు జమ్ముకశ్మీర్ బీజేపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.