శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వెళ్తూ రోడ్డు వెంట ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దాంతో బస్సు వెనుక భాగం పూర్తిగా ముందు వైపునకు తిరిగిపోయింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, బస్సు బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.
జమ్ము నుంచి దోడాకు వెళ్తున్న బస్సు ఉధంపూర్ జిల్లాలోని జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై సెయిల్ సల్లాన్ దగ్గర ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరగ్గానే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.