న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో దేశంలోని పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకే విడత ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం కల్పించే జమిలి ఎన్నికలపై కేంద్రం దూకుడుగా ముందడుగు వేస్తున్నది. జమిలి బిల్లులను కేంద్రం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. వీటికి సంబంధించిన రెండు బిల్లులకు గురువారమే కేంద్ర మంత్రివర్గం ఆమోదించగా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను శుక్రవారం సాయంత్రం ఎంపీలకు అందజేశారు. ముసాయిదా బిల్లుల ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ మొదటి సమావేశానికి రాష్ట్రపతి నోటిఫై చేసిన తేదీ నుంచి ఏకకాల ఎన్నికలు అమలులోకి వస్తాయి.
రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఈ నియమిత తేదీ తర్వాత ఎన్నికైన అన్ని రాష్ర్టాల అసెంబ్లీల పదవీ కాలాలు, లోక్‌సభ పూర్తికాల వ్యవధితో పాటు ముగిసేలా తగ్గిస్తారు. తద్వారా ఏకకాల ఎన్నికలకు మార్గం సుగమమవుతుంది. 2024 లోక్‌సభకు సంబంధించి మొదది సమావేశం ముగిసిందున తదుపరి లోక్‌సభ ఎన్నికలు 2029లో జరుగుతాయి. ఆ లోక్‌సభ మొదటి సమావేశంలో రాష్ట్రపతి నోటిఫై చేస్తే ఆ లోక్‌సభ పూర్తి పదవీ కాలం ఉంటే 2034లో తొలి విడత జమిలీ ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్లు ప్రకారం అసెంబ్లీలకు ఉన్న నిబంధనలే కేంద్ర పాలిత ప్రాంతాలపైన ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పుదుచ్చేరిలకు కూడా వర్తిస్తాయి. ఈ కొత్త జమిలి ఎన్నికల బిల్లు ప్రకారం నిర్దేశిత కాల పరిమితి కన్నా ముందే పార్లమెంట్, రాష్ట్ర, యూటీల అసెంబ్లీలు రద్దయితే, ఆయా అసెంబ్లీలకు, పార్లమెంట్‌కు మిగిలి ఉన్న కాలానికి మాత్రమే మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి.
‘దేశంలోని నిరుద్యోగం. ద్రవ్యోల్బణం లాంటి ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే కేంద్రం జమిలి ఎన్నికల పాట పాడుతున్నది. ఇది ప్రజలను కలవర పరిచే ఆయుధం. సమస్యలను పక్కదారి పట్టించే అంశం’ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విమర్శించారు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77 శాతం ఓటర్లు కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశం ఉందని ఐడీఎఫ్సీ ఇనిస్టిట్యూట్ చేసిన సర్వే పేర్కొందని అన్నారు. క్రూరమైన దంతాలు, గోళ్లతో కబళించడానికి సిద్ధంగా ఉన్న ఈ బిల్లును పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు వ్యతిరేకిస్తారని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
ఈ జమిలి ఎన్నికల బిల్లు ‘భారత దేశం ఆలోచన’ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, ఇది దేశ సమాఖ్య నిర్మాణానికి హాని కలిగిస్తుందని సీపీఐ(ఎం) నేత ఎంవై తరిగామి పేర్కొన్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని అన్ని పార్టీల వారు వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఇప్పటికే ఒకే దేశం-ఒకే పన్ను విధానం పేరిట వసూలు చేస్తున్న లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం తన వద్ద ఉంచుకుంటున్నది. తమ వాటా కోసం రాష్ర్టాలు వారిని దేహీ అని వేడుకోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. భారత దేశ పునాదుల పటిష్ఠత భిన్నత్వంలో ఏకత్వంపై ఆధారపడి ఉందని, దానికి భంగం కలిగించడానికే కేంద్రం చేసే ఏ ప్రయత్నమైనా దేశానికి హాని కలిగిస్తుందని అన్నారు.
జమిలి ఎన్నికల వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని కేంద్రం ప్రకటిస్తున్నా, దానిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశమంతా ఏక కాలంలో ఎన్నికలు జరగడంతో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని, దాంతో దేశమంతటా అభివృద్ధి పనులు, ముఖ్యమైన అంశాలపై విధాన నిర్ణయాలు ఆగిపోతాయని ఇది ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శలు వస్తున్నాయి. దేశమంతా జరిగే ఎన్నికలకు సరిపడా భద్రతా సిబ్బంది ఉండరని, దీని కారణంగా శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో మునిగి తేలడం వల్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఒకవేళ అసెంబ్లీ, పార్లమెంట్ నిర్దేశిత గడువు కన్నా ముందే రద్దయితే మిగిలిన కాలానికి మాత్రమే ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ఉండటం వారిని ఎన్నుకున్న ప్రజలను అవమానించడమే కాక, వారి హక్కును కాలరాయడమేనని వారు తెలిపారు.