ఆస్ట్రేలియా వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాపై విరుచుకుపడ్డారు. ఇరు దేశాల మధ్య జరిగిన లిఖిత పూర్వక హామీలను చైనా తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇలా హామీలను తుంగలో తొక్కడం మూలంగానే ఎల్ఏసీ వద్ద భారత్, చైనా మధ్య ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మేరిస్పైనే తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా లాంటి పెద్ద దేశం లిఖిత పూర్వక హామీలను తుంగలో తొక్కితే.. అంతర్జాతీయ యవనికపై ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఖ్వాద్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యల ప్రస్తావన కూడా వచ్చిందని జైశంకర్ వెల్లడించారు. చైనా ఎలాంటి పనులు చేస్తోందన్న విషయాన్ని ఖ్వాద్ వేదికగా ఇతరులకు కూడా తెలియజేశామని, పొరుగు దేశంలో ఏం జరుగుతుందో కూడా సోదాహరణంగా చర్చించామని జైశంకర్ పేర్కొన్నారు.