Jaishankar | భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ శనివారం న్యూఢిల్లీలో బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీని కలిశారు. డేవిడ్ లామీ తన ప్రతినిధి బృందంతో కలిసి భారతదేశానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ భారత్ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉందని, మిత్ర దేశాన్ని దాన్ని అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నామన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించినందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు ఇచ్చినందుకు భారత విదేశాంగ మంత్రి బ్రిటిష్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ రెండు రోజుల భారత పర్యటన కోసం శనివారం ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు. లామీ బృందం పర్యటన రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించనున్నది. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడుతూ తాము ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పాలసీని అవలంబిస్తామన్నారు. తమ మిత్రదేశాలు దీన్ని అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నామన్నారు. ఇటీవల ముగిసిన భారతదేశం-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పదం నిజమైన అర్థంలో ఒక మైలురాయిగా జైశంకర్ అభివర్ణించారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ నుంచి సరిహద్దు ఉగ్రవాదం అంశాన్ని కూడా భారతదేశం లేవనెత్తింది.
గత నెలలో జరిగిన సైనిక ఘర్షణ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భారతదేశం, పాకిస్తాన్ రెండింటితోనూ సంప్రదింపులు జరిపిన దేశాల జాబితాలో బ్రిటన్ సైతం ఉంది. మే 16 నుంచి లామీ ఇస్లామాబాద్‌లో రెండు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి మే 10న భారతదేశం, పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయన స్వాగతించారు. భారతదేశ పర్యటనకు ముందు, డేవిడ్ లామీ కూడా పాకిస్తాన్లో రెండు రోజుల పర్యటించిన ఆయన.. భారతదేశం -పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.