Loksabha Elections 2024 : ఎన్నికల మేనిఫెస్టోలో తమ హామీల గురించి వివరించే గ్యారంటీ కార్డును దేశంలో కోట్లాది కుటుంబాలకు చేరేలా చూస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగం, ధరల మంటే ప్రధాన అంశాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దైనందిన జీవితంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. వాస్తవ అంశాలను మరుగునపరిచి మత ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఇక రాజస్ధాన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఈరోజు 10 కోట్ల మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి అందుకుంటున్నారని అన్నారు. రైతులు ఆర్ధికంగా బలోపేతం కావడం కోసం బీజేపీ ప్రభుత్వం పాటుపడుతున్నదని చెప్పారు.
2024 ఎన్నికలు వికసిత్ భారత్ ప్రచారానికి ఊతమిస్తాయని అన్నారు. కాంగ్రెస్ వదిలేసిన ఎన్నో సమస్యలను తాము గత పదేండ్లలో చక్కదిద్దామని వివరించారు. దశాబ్ధాలుగా గరీబీ హఠావో నినాదాన్ని కాంగ్రెస్ వల్లెవేసిందని, అయితే మోదీ మాత్రం 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయటపడేశారని అన్నారు. కాంగ్రెస్ అహంకారంతో దళితులు, గిరిజనులు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేండ్లుగా పేదల బిడ్డ ప్రధాన సేవకుడిగా మారిన తర్వాత పేదలు పలు సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నారని అన్నారు.
Read More :
Harish Rao | వర్ణవివక్షతపై పోరాడిన క్రాంతికారుడు జ్యోతిబా ఫూలే: హరీశ్ రావు