జైపూర్: సుమారు 11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా 9 మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. (Court Sentences 2 Congress MLAs) అయితే వారందరికీ బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చింది. 2014 ఆగస్టు 13న జైపూర్‌లోని రాజస్థాన్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం బయట జేఎల్ఎన్ మార్గాన్ని సుమారు 20 నిమిషాలపాటు నిరసనకారులు దిగ్బంధించారు. ఈ నిరసన సందర్భంగా చట్టవిరుద్ధంగా సమావేశమై ప్రజా రహదారిని అడ్డుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2016 ఆగస్ట్ 11న ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
కాగా, ఈ కేసుపై 11 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగింది. జైపూర్ జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా తొమ్మిది మంది వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. ఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. వారందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పు, శిక్ష నిలిపివేతపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల సమయం ఇచ్చింది.
మరోవైపు జైలు శిక్ష పడిన 9 మందిలో లడ్నన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్, షాపురాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనీష్ యాదవ్, జోత్వారా అసెంబ్లీ స్థానానికి చెందిన మాజీ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరి ఉన్నారు. అయితే దోషిగా నిర్ధారించిన ఇద్దరు కాంగ్రెస్ నేతల అసెంబ్లీ సభ్యత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రస్తుత చట్టం ప్రకారం జైలు శిక్ష రెండేళ్లకు మించితేనే ఎంపీ, ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది.
Also Read:
Thieves Ate Noodles | నూడుల్స్ తిని, ఏసీ చల్లదనాన్ని ఆస్వాదించి.. దర్జాగా చోరీ