లక్నో: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలుపడ్డారు. ఎంచక్కా నూడుల్స్ వండుకుని తిన్నారు. (Thieves Ate Noodles) ఏసీ వేసుకుని చల్లదనాన్ని ఆస్వాదించి విశ్రాంతి తీసుకున్నారు. తాపీగా అన్ని బీరువాలు, అల్మారాలు వెతికి చోరీకి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రిటైర్డ్ బ్యాంక్ అధికారి చికిత్స కోసం అతడి కుటుంబ సభ్యులంతా ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో లాక్ వేసి ఉన్న ఆ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. కిచెన్‌లోని స్టవ్‌పై నూడుల్స్ వండుకున్నారు. బెడ్ రూమ్‌లో ఏసీ వేసుకుని అక్కడ నూడుల్స్ తిన్నారు. విశ్రాంతి తర్వాత అన్ని గదుల్లోని బీరువాలు, అల్మారాలను వెతికి చోరీకి పాల్పడి పారిపోయారు.
కాగా, ఆ ఇంటి డోర్ లాక్ తీసి ఉండటాన్ని పొరుగింటివారు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోని బీరువాలు, అల్మారాలు తెరిచి ఉండటాన్ని గమనించారు. బట్టలన్నీ చిందరవందరగా పడేసి ఉండటాన్ని చూశారు. అలాగే కిచెల్లోని స్టవ్‌పై నూడుల్స్ వండిన ఆనవాళ్లు, బెడ్‌పై నూడుల్స్ తిన్న ప్లేట్లు, ఏసీ ఆన్ చేసి ఉండటాన్ని పరిశీలించారు. దొంగలు చాలా తాపీగా చోరీకి పాల్పడినట్లు గ్రహించారు.
మరోవైపు ఢిల్లీలో ఉన్న ఆ కుటుంబ సభ్యులను పోలీసులు సంప్రదించారు. వారి ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని చెప్పారు. అయితే విలువైన బంగారు నగలను తమ వెంట తెచ్చినట్లు ఆ ఇంటి వారు తెలిపారు. దీంతో ఆ కుటుంబం తిరిగి వచ్చిన తర్వాత ఏం చోరీ జరిగిందో అన్నది తెలుసుకుని దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి చెప్పారు. దొంగలను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: అదుపుతప్పిన స్కార్పియో.. తర్వాత ఏం జరిగిందంటే?