ముంబై: జైన దేవాలయం కూల్చివేతపై జైనులు నిరసన తెలిపారు. (Jains protest) బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ తమ ఆలయాన్ని కూల్చివేశారని మండిపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. విలే పార్లే ఈస్ట్‌లోని నేమినాథ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న అక్రమ జైన దేవాలయాన్ని ఏప్రిల్ 15న బీఎంసీ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. దీనిపై జైన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం జైనులు ఎత్తున నిరసన తెలిపారు. బీఎంసీ చర్యను వ్యతిరేకించారు.
కాగా, వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రామకృష్ణ హోటల్ యజమానుల సూచన మేరకు జైన ఆలయాన్ని కూల్చివేశారని జైనులు ఆరోపించారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ బీఎంసీ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. దీనిపై కోర్టులో పోరాడుతామని అన్నారు. ఆలయాన్ని కూల్చివేసిన చోట టెంట్లు వేసి విగ్రహాలను అక్కడ ఉంచారు. ప్రార్థనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. శ్రీ 1008 దిగంబర్ జైన్ మందిర్ ట్రస్ట్ నిర్వహణలో ఉన్న ఈ ఆలయాన్ని 1962లో అభివృద్ధి చేశారు.
మరోవైపు జైన మందిరం కూల్చివేత నేపథ్యంలో మహారాష్ట్రతో పాటు బీఎంసీలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కూల్చివేతనను పర్యవేక్షించిన వార్డ్ ఇన్చార్జ్ అసిస్టెంట్ కమిషనర్ నవనాథ్ ఘడ్గే పాటిల్‌ను బదిలీ చేశారు. అయితే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాను పని చేసినట్లు ఆయన తెలిపారు. చట్టపరమైన అన్ని విధానాలను అనుసరించినట్లు వెల్లడించారు.
Jain Community does Peaceful Protests against hasty Demolition of Jain Temple at Vile Parle by BMC #jainmandir #jain pic.twitter.com/lQQUiISdUW
— Yatin Mota (@yatinmota) April 19, 2025