Jagdeep Dhankhar | బెంగళూరు, జనవరి 11 : ఏ పదవికైనా సర్వీసు పొడిగింపు సరికాదని, వరుసలో తర్వాత ఉన్న వారికి ఇది ఎదురు దెబ్బనేనని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో శనివారం ప్రారంభమైన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల 25వ జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. పదవీకాలాన్ని పొడిగించడం అంటే కొందరు వ్యక్తులు తప్ప మరొకరు ఆ పదవిని చేపట్టలేరని చెప్పడమేనని, ఇది ఒక కల్పన మాత్రమేనని అన్నారు. దేశంలో ప్రతిభ పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో నియామకాలు ప్రాపకం, పక్షపాతంతో జరగవద్దని ఆయన అన్నారు. నిర్దిష్ట భావజాలం లేదా వ్యక్తులతో సంబంధం ఉన్న వారు కమిషన్ చైర్మన్, సభ్యులుగా ఉండొద్దని, ఇలా ఉండటం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీయడమేనని పేర్కొన్నారు. దేశంలో పేపర్ లీకేజీ అనేది పరిశ్రమగా, వ్యాపారంగా మారిందని.. ఈ ప్రమాదాన్ని అరికట్టాలని ఆయన సూచించారు