న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : పరువు నష్టం కేసులను నేర రహితంగా పరిగణించాలన్న వాదనపై సుప్రీంకోర్టు సోమవారం సానుకూలత వ్యక్తం చేసింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) రిటైర్డ్ ప్రొఫెసర్ అమితా సింగ్ ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ది వైర్‌పై దాఖలు చేసిన పరువు నష్టం వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేసింది. ది వైర్‌ని నడుపుతున్న ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం దాఖలు చేసిన పిటిషన్‌పై అమితా సింగ్‌కి జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం నోటీసు జారీ చేసింది. “పరువు నష్టం కేసులను నేర రహితంగా పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యూస్ పోర్టల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనం వ్యాఖ్యలతో ఏకీభవించారు.
జేఎన్‌యూపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ డెన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సెక్స్ రాకెట్ అని కూడా వ్యవహరించిన 200 పేజీల పత్రాన్ని అమితా సింగ్ నేతృత్వంలో కొందరు జేఎన్‌యూ ప్రొఫెసర్లు రూపొందించారని 2016లో ది వైర్ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, వేర్పాటువాద, ఉగ్రవాద స్థావరం అని ఈ పత్రానికి శీర్షిక పెట్టారని న్యూస్ పోర్టల్ తన వ్యాసంలో పేర్కొంది. ఈ పత్రాన్ని జేఎన్‌యూ పాలకులకు వారు అందచేశారని, భారత్‌లో వేర్పాటువాదాన్ని చట్టబద్ధం చేస్తూ జేఎన్‌యూలో కాలం చెల్లిన సంస్కృతిని కొందరు ప్రొఫెసర్లు ప్రోత్సహిస్తున్నారని కూడా ఆ పత్రంలో పేర్కొన్నారని న్యూస్ పోర్టల్ తెలిపింది. దీంతో ది వైర్‌పై, విలేకరిపైన అమితా సింగ్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు వివిధ న్యాయస్థానాలలో విచారణ ఎదుర్కొంటోంది. బీఎన్ఎస్ సెక్షన్ 356 ప్రకారం పరువు నష్టం నేరంగా పరిగణనలోకి వస్తుంది.