కోల్‌కతా: బీజేపీని మూడేండ్లలో భారత్ నుంచి తరిమేయాలని, ఇదే తన లక్ష్యమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ‘ప్రతి బీజేపీ స్థానానికి వెళ్లి వారిని పదవీచ్యుతుడిని చేస్తాం. వారి ఈడీ, సీబీఐ ఏమి చేస్తాయి? ఏమీ చేయలేవు’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లో ఈ నెల 30న రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగనున్న ముర్షిదాబాద్ జిల్లాలో అభిషేక్ బెనర్జీ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. ‘బీజేపీకి అభివృద్ధి అంటే కేవలం పేర్లను మార్చడమే. వారు ముర్షిదాబాద్‌లో గెలిచినట్లయితే, దానిని మోదీషాబాద్ అని మార్చుకుంటారు’ అని దుయ్యబట్టారు.
దేశానికి ప్రణబ్ ముఖర్జీ లాంటి గొప్ప వ్యక్తిని అందించిన జిల్లా ఇది అని అభిషేక్ బెనర్జీ కొనియాడారు. బయట వ్యక్తులకు తాము లొంగి ఉండబోమని గతంలో హామీ ఇచ్చామన్న ఆయన, మమత వారి ముందు తలవంచాలా అని ఓటర్లను ప్రశ్నించారు.