పాట్నా, ఆగస్టు 24: విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పొగబెట్టేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను బాహాటంగానే వాడుకోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చాంశమైంది. నయానో, భయానో విపక్ష ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు బీజేపీ పాలకులు నిర్లజ్జగా ఆ సంస్థలను ఉసిగొల్పుతున్నాయనేది బహిరంగ రహస్యమే. నిన్నటికి నిన్న ఢిల్లీలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై సీబీఐ దాడులు జరిగితే.. తాజాగా బీహార్‌లో నితీశ్ సర్కారు బలపరీక్ష రోజే పాట్నా తదితర ప్రాంతాల్లో బుధవారం ఆర్జేడీ నేతలకు చెందిన ఇండ్లు, కార్యాలయాల్లో సీబీఐ పెద్దఎత్తున సోదాలు నిర్వహించింది. గురుగ్రామ్‌లోని ఓ మాల్లో కూడా ఈ సోదాలు జరిగాయి. సోదాలపై బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.
ఐటీ, సీబీఐ, ఈడీ అనే మూడు దర్యాప్తు సంస్థలు కేంద్రానికి ‘ముగ్గురు అల్లుళ్లు’గా మారాయని, విపక్ష రాష్ర్టాలపైకి వాటిని ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. సోషలిస్టు భావజాలాన్ని ధ్వంసం చేసేందుకు సీఎం నితీశ్‌కుమార్ పార్టీని దెబ్బతీయాలని బీజేపీ సర్కార్ ప్రయత్నించిందని ఆరోపించారు. కొత్తగా ఏర్పాటైన ‘మహాగట్బంధన్ సర్కారు’ విశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ తేజస్వి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సోషలిజానికి కట్టుబడి ఉన్నందుకు మా నాన్న లాలూప్రసాద్ యాదవ్, అమ్మ రాబ్డీదేవి, మా అక్కాచెల్లెళ్లు, నేనూ మూల్యం చెల్లించుకొంటున్నాం. సీఎం నితీశ్దీ, నాదీ ఒకే భావజాలం. మా సోషలిస్టులు పండించిన పంటను మీరు ఎత్తుకొని పోతానంటే కుదరదు’ అని హెచ్చరించారు. గురుగ్రామ్‌లో సీబీఐ దాడి చేసిన మాల్ తనకు చెందినట్టు మీడియా ప్రసారం చేయడంపై తేజస్వి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీడియా కొంత పరిశోధన చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మీడియాను బీజేపీ గుప్పిట్లో పెట్టుకున్నదని దుయ్యబట్టారు. బీహార్‌లో సమైక్య విపక్షం చేతుల్లో 2024 ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతో ‘అల్లుళ్లను’ పంపిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి 2024 ఎన్నికల భయం పట్టుకున్నదన్నారు.
ఖండించిన విపక్షాలు
కేంద్ర సంస్థల దాడులను బీజేపీయేతర పక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ప్రజలు దాడులను గమనిస్తున్నారని, ఇవి ఎందుకు జరుగుతున్నాయో వారికి తెలుసునని బీహార్ మాజీ సీఎం రాబ్డీదేవి అన్నారు. ఈ దాడులన్నీ బీజేపీకి లబ్ధి కలిగించేందుకే జరుగుతున్నాయని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తిసింగ్, ఎంపీ మనోజ్ ఝా దుయ్యబట్టారు. కేంద్రంలో అధికార పార్టీ మారితే దాడులు జరుపుతున్న అధికారులపై దర్యాప్తు తప్పకపోవచ్చని కాంగ్రెస్ ప్రతినిధి అసిత్నాథ్ హెచ్చరించారు. హిట్లర్, ముసోలినీ ఎక్కువ కాలం అధికారం చెలాయించలేకపోయిన సంగతిని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. బీజేపీ అన్ని రాజ్యాంగ మర్యాదలను గాలికి వదిలేసిందని సీపీఐ (ఎంఎల్) ఎమ్మెల్యే సందీప్ అన్నారు.
2024లో సమైక్య పోరు: నితీశ్
బీజేపీ రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ మండిపడ్డారు. జేడీయూలో చీలికలు తెచ్చేందుకు ఆ పార్టీ కుట్రలు పన్నుతున్నదని ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై జరిగిన చర్చకు నితీశ్ సమాధానమిస్తూ, అటల్ బిహారీ వాజపేయి, ఎల్కే అద్వానీ వంటి నేతలు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అద్వానీ తదితర నేతలను పక్కన పెట్టినందువల్లే 2013లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నానని చెప్పారు. బీజేపీ ఎజెండాను ఓడించేందుకు బీహార్‌లోని పార్టీలన్నీ ఏకమయ్యాయని, 2024లో సమైక్య పోరు తప్పదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పనిచేయడం లేదని, ప్రచారానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఈ ధరణితో విసిగిపోయి బీహార్ అభివృద్ధి కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని పేర్కొన్నారు. స్వాతంత్య్రపోరాటంలో బీజేపీ ఎక్కడున్నదని నిలదీశారు.