న్యూఢిల్లీ, నవంబర్ 27 : ఐటీ రిటర్నుల్లో విదేశాల్లో ఉన్న ఆస్తులను వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి 25 వేల మందికి ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో హెచ్చరికలు పంపనున్నట్లు తెలిపింది. అసెస్మెంట్ ఏడాది 2025-26కిగాను వ్యక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో తమకు విదేశాల్లోవున్న ఆస్తులను వెల్లడించని వారిని గుర్తించినట్టు వెల్లడించింది.
ఇలాంటివారికి ఈ నెల 28 నుంచి ఎస్ఎంస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్టు, వీరు తమ ఐటీఆర్ని సవరించి డిసెంబర్ 31లోగా సమర్పించాల్సివుంటుందని సూచించింది. ఒకవేళ అప్పటిలోగా చేయకపోతే శిక్ష పరమైన చర్యలు ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించింది. 2024-25 లో 24,678 మంది తమ ఐటీ రిటర్నులను సవరించి తిరిగి దాఖలు చేశారు. వీరి విదేశీ ఆస్తులు రూ.29,208 కోట్లుగా ఉన్నాయి.