శ్రీహరికోట, జనవరి 29: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక మైలురాయిని అందుకుంది. 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. భారత దేశ అంతరిక్ష ప్రయోగ సామర్థ్యాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పింది. 1979లో మొదటి ప్రయోగంతో ప్రారంభమైన ప్రస్థానాన్ని శత ప్రయోగంతో దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. బుధవారం శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 వాహకనౌక ద్వారా ఎన్వీఎస్-02 అనే నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
27.30 గంటల కౌంట్‌డౌన్ తర్వాత బుధవారం ఉదయం 6.23 గంటలకు నింగికి ఎగిసిన వాహకనౌక 19 నిమిషాల ప్రయాణం తర్వాత ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీఓ)లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో ప్రకటించింది. 2025లో ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగమిది. భారత ఉపఖండంలో అత్యంత కచ్చితత్వంతో నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో పంపిస్తున్న నావిక్ శ్రేణి ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-02 రెండోది. భూఉపరితల, ఆకాశ, సముద్ర నావిగేషన్‌కు, వ్యవసాయ, ప్రయాణ, లోకేషన్ ఆధారిత మొబైల్ సేవలు, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. దీనిని బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది.
తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాల్లో ఘనమైన విజయాలు సాధించిన ఇస్రోకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్ఎల్వీ) అత్యంత నమ్మకమైన, అచ్చొచ్చిన వాహకనౌక. ఇప్పటివరకు ఇస్రో వంద ప్రయోగాలు చేపట్టగా, అందులో 62 పీఎస్ఎల్వీ ద్వారానే చేపట్టింది. 17 ప్రయోగాలను జీఎస్ఎల్వీ ద్వారా చేపట్టింది. పీఎస్ఎల్వీ-డీ1 ద్వారా 1993 సెప్టెంబర్ 20న మొదటిసారి పీఎస్ఎల్వీ వాహకనౌకను ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విఫలమైనా 1994లో విజయవంతమైన ప్రయోగంతో ఇస్రోకు పీఎస్ఎల్వీ అనేక విజయాలను అందించింది. కాగా, ఇస్రో ఇప్పటివరకు ఆరు తరాల వాహకనౌకలను తయారుచేసింది. ప్రొఫెసర్ సతీశ్ ధావన్ మార్గదర్శకంలో, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా 1979లో మొదటి వాహకనౌక ఎస్ఎల్వీ-3 ఈ1ను తయారుచేసింది.
వంద ప్రయోగాలను పూర్తి చేయడానికి 46 ఏండ్లు పట్టినప్పటికీ, ఇప్పుడు అత్యంత వేగంగా ఇస్రో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. మరో ఐదేండ్లలో ఇంకో 100 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రానున్న ఐదేండ్లలో ప్రయోగాల్లో 200 మార్కులు అందుకుంటామని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 46 ఏండ్ల ఇస్రో ప్రస్థానంలో 548 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికిల్(ఎన్జీఎల్వీ) అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు.