బెంగళూరు : అంతర్జాతీయ మార్కెట్ కోసం కొత్తగా పునర్వినియోగ రాకెట్‌ను రూపొందించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందని, దీంతో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గించగలదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. ‘బెంగళూరు స్పేస్ ఎక్స్పో-2022’లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కిలో పేలోడ్‌ను కక్షలో ప్రవేశపెట్టేందుకు పది నుంచి 15వేల అమెరికన్ డాలర్ల ఖర్చు అవుతుందన్న ఆయన.. దీన్ని కిలోకు 5వేల నుంచి వెయ్యి డాలర్లకు తగ్గించాలన్నారు.
దీనికి ఏకైక మార్గం రాకెట్‌ను మళ్లీ వినియోగించుకునేలా చూడడమేనన్నారు. ప్రస్తుతం భారత్‌లో లాంచ్ వెహికిల్ (Rockets)లో రీయూజబుల్ టెక్నాలజీ లేదన్నారు. జీఎస్ఎల్వీ మాక్-3, తర్వాత మనం నిర్మించబోయే రాకెట్ పునర్వినియోగ రాకెట్‌గా ఉండాలనే ఆలోచన ఉందన్నారు. వివిధ పరిశ్రమలు, స్టార్టప్‌లు, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) భాగస్వామ్యంతో కొత్త రాకెట్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే కొద్ది నెలల్లో ఇది (ప్రతిపాదన) రూపుదిద్దుకోవాలని, అలాంటి రాకెట్‌ను చూడాలనుకుంటున్నామన్నారు.