Karnataka | కొప్పల్, మార్చి 8: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ పర్యాటకురాలి(27)తోపాటు మరో స్థానిక మహిళపై(29) దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. కొప్పల్ జిల్లాలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది. మహిళల వెంట వచ్చిన ముగ్గురు పురుషులను కాల్పలోకి తోసేసి, నేరగాళ్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అమెరికా, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడగా, ఒడిశాకు చెందిన బిబాశ్ కాలువలో కొట్టుకుపోయి మృతిచెందాడు. శనివారం ఉదయం అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలైన స్థానికురాలి కథనం ప్రకారం సనాపూర్ సమీపంలోని తుంగభద్ర లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద రాత్రి వేళ తామంతా నక్షత్రాలను వీక్షిస్తుండగా.. బైక్‌పై వచ్చిన దుండగులు మొదట తమకు పెట్రోల్ దొరుకుతుందా అని అడిగారని.. ఆ తర్వాత వంద రూపాయలివ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. అయితే డబ్బులివ్వడానికి తాము నిరాకరించడంతో వారు లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు.