Rahul Gadhi : ‘బడా వ్యాపారవేత్తలైన ముకేశ్ అంబానీ (Mukhesh Ambani), గౌతమ్ అదానీ (Goutham Adani) లకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడమే అభివృద్ధా..?’ అని కాంగ్రెస్ అగ్ర నేత (Congress top leader), లోకసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar assembly elections) ప్రచారంలో భాగంగా దర్భంగాలో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. మోదీ సర్కారు (Modi govt) పై విమర్శలు గుప్పించారు.
భూమిలేని నిరుపేదలకు భూమి ఇవ్వడానికి భూమి కొరత ఉన్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారని, మరి అదే నిజమైతే అదానీకి ఒక్క రూపాయికే కట్టబెడుతున్న భూమి ఎక్కడిదని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. అది బీహార్ రైతుల భూమి కాదా..? అని ప్రశ్నించారు. అంబానీ, అదానీ కావాలనుకుంటే భూమి దొరుకుతుందని, రెండు నిమిషాల్లో రైతుల నుంచి లాక్కుని వారికి కట్టబెడుతారని ఆరోపించారు.
కానీ పేద రైతు తన బిడ్డ ఉపాధి కోసం భూమి అడిగితే బీహార్‌లో భూమి ఎక్కుడుందని అమిత్ షా దబాయిస్తున్నారని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ధారవిలో ఎంతో మంది బీహారీలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని, అయితే లక్షల కోట్ల విలువ చేసే ఆ భూమిని లాక్కుని మోదీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అదానీకి కట్టబెట్టిందని విమర్శించారు.
మోదీ సర్కారు దృష్టిలో అభివృద్ధి అంటే ఇదేనని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. అంబానీ, అదానీలకు ఆస్తులను కట్టబెట్టడమే అభివృద్ధి అని విమర్శించారు. బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తీసుకున్న కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయడమే అభివృద్ధి అని మండిపడ్డారు.