న్యూఢిల్లీ: ట్విట్టర్ ఇండియా రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను లాక్ చేయడంపై ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ ( Priyanka Gandhi ) వాద్రా మండిపడ్డారు. ట్విట్టర్ తన సొంత నియమాలను పాటిస్తోందా లేదంటే మోదీ పాలసీనా..? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ ఖాతాలను ఉమ్మడిగా మూసివేయడంలో పెద్దకుట్ర ఉందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి బీజేపీ ప్రభుత్వంతో ట్విట్టర్ జతకట్టిందనుకోవచ్చని ప్రియాంకాగాంధీ అనుమానం వ్యక్తంచేశారు.
‘కాంగ్రెస్ నేతల ఖాతాలకు లాక్ వేయడానికి ట్విట్టర్ తన సొంత పాలసీని పాటించిందా లేదంటే మోదీ ప్రభుత్వ పాలసీని పాటించిందా? ఒకవేళ సొంత పాలసీని పాటించినట్టయితే.. కాంగ్రెస్ నేతలు షేర్ చేసిన ఫొటోలనే సుప్రీంకోర్టు కమిషన్ కూడా షేర్ చేసింది. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాంగ్రెస్ నేతల ఖాతాలను మూకుమ్మడిగా లాక్ చేయడాన్ని బట్టిచూస్తే దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వంతో ట్విట్టర్ చేతులు కలిపిందని అనుకోవచ్చు’ అని ప్రియాంకాగాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీలో అత్యాచార బాధితురాలైన ఓ చిన్నారితో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ట్విట్టర్ గైడ్‌లైన్స్‌ను రాహుల్‌గాంధీ అధిగమించారంటూ ఆయన ఖాతాను ఆగస్టు 6న లాక్చేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ అధికారిక ఖాతాకు, కాంగ్రెస్ నేతల, కార్యకర్తల ఖాతాలకు లాక్ వేశారు. ఇందులో వెరిఫైడ్ ఖాతాలు కూడా పెద్దసంఖ్యలో ఉన్నాయి. దాంతో ఈ విషయమై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాహుల్‌గాంధీ ఖాతాకు లాక్ వేస్తే వేలమంది రాహుల్ గాంధీలు వస్తారని, ప్రజల గొంతుకను వినిపిస్తూనే ఉంటారని యూత్ కాంగ్రెస్ అధినేత శ్రీనివాస్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకున్నారు. అంతేకాకుండా తమ ఖాతాలకు రాహుల్‌గాంధీ అని పేరు మార్చి ట్విట్టర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. మరి కొందరైతే ట్విట్టర్ పిట్టకు కాషాయం రంగు పూసి, ‘సంఘీ ట్విట్టర్’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేగాక ‘ట్విట్టర్ మోదీ సే డర్ గయా’ అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది.