Road Accident Victims | న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించే విషయంలో సొంత చట్టాలను అమలు చేయరా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం నిలదీసింది. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన గంటలోపే నగదు రహిత వైద్యం అందించడంలో కేంద్రం చేస్తున్న జాప్యానికి కారణమేంటని ప్రశ్నించింది. మోటార్ వాహనాల చట్టంలోని 164ఎ సెక్షన్ ఏప్రిల్ 1, 2022న అమల్లోకి వచ్చిందని.. అయినా కేంద్రం బాధితులకు నగదు రహిత వైద్య పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని అడిగింది. కేంద్రం పెద్దయెత్తున హైవేలను నిర్మిస్తున్నదని.. కానీ వాటిపై సౌకర్యాలు లేక ఆ రోడ్లపైనే ప్రమాదాల్లో ప్రజలు చనిపోతున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. వారంలోగా చట్టాన్ని అమలు చేస్తామన్న కేంద్రం మాటలను రికార్డ్ చేసింది.