(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో 2018లో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆర్భాటంగా తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్ (ఏబీ-పీఎంజేఏవై)’ పథకం నిర్వీర్యమౌతున్నది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో రూ. కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ కాగ్ బయటపెట్టగా, తాజాగా ఈ స్కీమ్ పరిధి నుంచి బయటకు వస్తామని ప్రైవేటు దవాఖానలు కేంద్రాన్ని హెచ్చరించాయి.
పథకానికి అవసరమైన నిధుల కేటాయింపు, బిల్లుల విడుదలలో జాప్యంతో తాము నష్టపోతున్నామని, దీంతో పథకం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకొన్నట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు మే 1న జరిగిన కేంద్ర ఆరోగ్యశాఖ, నీతిఆయోగ్ సమీక్షా సమావేశంలో ఆయా దవాఖానల ప్రతినిధులు తేల్చిచెప్పారు. ఆయుష్మాన్ స్కీమ్ అమలుకు అవసరమైన నిధులను 60:40 నిష్పత్తిలో కేంద్రం, రాష్ర్టాలు భరించాల్సి ఉండగా, కొన్ని రాష్ర్టాలు చెల్లింపులు జరుపట్లేదని అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (ఏహెచ్‌పీఐ) డైరెక్టర్ జనరల్ గిరిధర్ గ్యానీ తెలిపారు.
కొత్త లబ్ధిదారులు పథకంలో చేరితే వారికయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ర్టాలే భరించాలని కేంద్రం నిబంధనలు పెట్టిందని గుర్తుచేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్ బిల్లులను విడుదల చేయట్లేదని తెలిపారు. వెరసి కేంద్రం-రాష్ర్టాల మధ్య గొడవతో తాము నష్టపోతున్నట్టు ప్రైవేటు దవాఖానల ప్రతినిధులు వాపోతున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించకుంటే ఈ స్కీమ్‌ను తమ దవాఖానల్లో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ప్రచార ఆర్భాటమే తప్ప, బీజేపీ సర్కారుకు పేదల ఆరోగ్యం పట్టదంటూ సోషల్‌మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.
శవాలకు చికిత్స.. బిల్లుల సృష్టి
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలులో చాలా అక్రమాలు జరిగాయని గత ఆగస్టులో కాగ్ నివేదిక బయటపెట్టింది. ఒకే ఫోన్ నంబర్‌పై 7.50 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని, అప్పటికే మరణించిన 89 వేల మంది పేర్లను రికార్డుల్లోకి ఎక్కించి శవాలకు చికిత్స అందించినట్టు నకిలీ బిల్లులు సృష్టించారని నివేదిక కుండబద్దలు కొట్టింది. కనీస సదుపాయాలు, పడకలు కూడా లేని దవాఖానలను కూడా స్కీమ్ పరిధిలోకి చేర్చినట్టు తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని ఒక్క దవాఖానలోనే ఈ స్కీమ్ ద్వారా రూ. 200 కోట్లు పక్కదారిపట్టినట్టు వార్తలు రావడం కలకలం సృష్టించింది.